Blog

ఏకాగ్రతను పెంపొందించుకోవడం ఎలా?

 

ఏకాగ్రతను కలిగి ఉండడం ఎంతో కష్టం…..కదా!

“సార్, పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టినపుడు, కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. కాని మనస్సు మాత్రం చదువుతున్న విషయంపై ఉండకుండా ఇతర ఆలోచనలతో నిండి పోతుంది. నేనేం చేయాలి, కాస్త చెప్పండి.”

-ఓ విద్యార్థి

 

నిజమే….

ఇది ఆ ఒక్క విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్య కాదు, అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య. పరీక్షల్లో తప్పనిసరిగా విజయం సాధించాలంటే ప్రతీ విద్యార్థి రెండు అంశాలపై దృష్టి పెట్టాలి.

అవి…

 • ఏకాగ్రత   
 • క్రమశిక్షణ

ఈ రెండు అంశాలను కలిగి ఉన్న విద్యార్థిని విజయం సాధించకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. అయితే ముందుగా పై ఉదాహరణలోని విద్యార్థి చెప్పిన “ఏకాగ్రత లేకపోవడం” అనే సమస్య గురించి చూద్దాం.

 “ఏం చదువుతున్నామో దాని మీదే మనస్సుని కేంద్రీకరించడమే” ఏకాగ్రత. అంటే కళ్ళూ, మనస్సూ రెండూ కలిసి పని చేయడం.

మరి ఈ ఏకాగ్రతని పొందాలంటే ఏమి చేయాలి?

1. మీ ఏకాగ్రతకి భంగం కలిగించే వాటికి దూరంగా ఉండండి:

ఏకాగ్రత అనేది ఓ సెలయేటి ప్రవాహంలాంటిది. ఈ ప్రవాహం ఒక్కసారి మొదలయితే కొన్ని గంటలపాటు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రవాహానికి ఏదైనా అడ్డు తగిలితే మళ్ళీ మునుపటి స్థితి రావడం కష్టం. అందువల్ల, వచ్చిన ఏకాగ్రతని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఇలా మీ ఏకాగ్రతకి భంగం కలిగించే వాటిలో ప్రధానమైనవి.

 • మొబైల్ ఫోన్ 
 • టివి 
 • ఫ్రెండ్స్

మీరు సీరియస్ గా చదువుకుంటున్నారు. అంతలో మెసేజ్ వచ్చినట్టుగా మీ మొబైల్ లో నోటిఫికేషన్ అలెర్ట్ వచ్చింది. మీరు చదవడం ఆపి ఫోన్ తీసి, reply ఇచ్చి మళ్ళీ చదవడం మొదలు పెడతారు, అవునా?

ఇప్పుడు మీకేమి అనిపిస్తుంది.

“మెసేజ్ చూడటంలో కేవలం ఒక్క నిమిషమే కదా వృధా అయ్యింది. అదేమంత పెద్ద తప్పు కాదులే..”

నిజానికి ఇక్కడ వృధా అయ్యింది ఒక్క నిముషమే కాదు, విలువైన మీ ఏకాగ్రత …… చదువుపై కొనసాగుతున్న మీ ఫోకస్ కాస్తా మీ ఫ్రెండ్స్ పైకి మరలింది. అది మళ్ళీ చదువు పైకి మరలడం అంత సులభం కాదు.

అందుకే చదువుకునే సమయంలో Facebook, Whatsapp………లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రద్ధగా చదవగలుగుతారు.

టీవీ: ఈ రోజుల్లో మనమందరమూ కూడా సీరియల్స్, క్రికెట్, గేమ్ షోస్ చూడకుండా ఉండలేని స్థితిలో ఉన్నాం. పక్క గదిలో టీవీ నడుస్తూండగా మీ గదిలో చదువుకుంటున్న మీకు ఏకాగ్రత లభించడం దాదాపుగా అసాధ్యం. మరి దీనికి పరిష్కారం ఎలా?

ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. “Out of sight, out of mind”

ఏదైనా మనకు కనిపించకుండా కొన్ని రోజులు ఉంటే నెమ్మదిగా దానిగురించి ఆలోచించడం కూడా తగ్గిపోతుంది. అంటే టీవీ కనిపించని ప్రదేశంలో గనక మీరు ఉన్నట్లయితే నెమ్మదిగా టీవీ గురించిన ఆలోచనలు కూడా కను మరుగవుతాయి.

మరి టీవీ కనిపించని ప్రదేశాలు ఏంటి?

అన్నింటి కన్నా ఉత్తమమైన చోటు….

లైబ్రరీ.

చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీలోని దేవాలయాల్లో, పార్కుల్లో కూడా చదవడం మనం గమనిస్తాం. చదువుకునే కోరిక ఉంటే, టీవీ లేని స్నేహితుడిని సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు.

2. ఏకాగ్రత లోపించడానికి మరొక కారణం, ఇతర ఆలోచనలు:

ఈ ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. అందులో మూడింటిని మనం పరిశీలిద్దాం.

సమస్యలు: ప్రతీ వ్యక్తికీ సమస్యలుంటాయి. సమస్యలులేని వ్యక్తి ఎక్కడా ఉండదు. ఈ సమస్యలు ఆరోగ్యపరమైనవి, కుటుంబపరమైనవి, ఆర్తికమైనవి లేక వ్యక్తిగతమైనవి కావొచ్చు.

మీరు చదవడం ప్రారంభించగానే ఏదో ఒక సమస్య మీ మనసులోకి  ప్రవేశించి మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది.

దీనిని ఎదుర్కొనడానికి రెండు టెక్నిక్స్ ఉన్నాయి.

మొదటి టెక్నిక్: ఏదైనా సమస్య మీ ఆలోచనల్లోకి వచ్చినపుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.

“నేను ఏ విధంగానైనా ఈ సమస్యని పరిష్కరించగలనా?”

సమాధానం గనక అవును అయినట్లయితే వెంటనే ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం మొదలు పెట్టండి.

సమాధానం గనక “కాదు” అయినట్లయితే, ఈ విషయంలో ప్రస్తుతం మీరు చేయగలిగిందేమి లేదు కాబట్టి ఆ విషయాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టండి.

రెండవ టెక్నిక్:

మొదటి టెక్నిక్ వల్ల అంతగా ప్రయోజనం లేనపుడు ఈ రెండవ టెక్నిక్ అద్భుతంగా పని చేస్తుంది.

రోజులో ఏదో ఒక గంట సమయాన్ని “Worry Hour”గా భావించండి. అంటే మీకు ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి ఈ Worry Hour లోనే ఆలోచిస్తారు. మిగతా ఏ సమయంలో నైనా సమస్యల గురించి ఆలోచనలు వచ్చినపుడు, ఆ సమస్యని note చేసుకుని “దీని గురించి Worry Hour లో మాత్రమే ఆలోచిస్తాను” అనుకుని చదవడం పై దృష్టి సారిస్తారు.

అయితే నిజానికి లక్ష్యం సాధించాలన్న తపన, కోరిక మీ మనస్సులో ఉంటే ఏ సమస్య కూడా మీ ఏకాగ్రతని భంగం చేయలేదు. దీని గురించి ఒక చిన్న కథ చెబుతాను.

ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఓ యువకుడు వచ్చాడు.

“గురువు గారూ…నాకు దేవుని చూడాలని ఉంది” అనడిగాడు. గురువు చిన్నగానవ్వి “అలాగే జరుగుతుంది వెళ్ళు, నాయనా” అన్నాడు. ఆ యువకుడు వెళ్ళిపోయి కొన్నిరోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. అతని కోరిక నెరవేరలేదు కాబట్టి గురువుగారిని మళ్ళీ అడిగాడు. గురువు మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. ఆ యువకుడు వెళ్ళిపోయాడు.

ఓ రోజు మళ్ళీ వచ్చిన యువకుడిని చూసి గురువు గారు “పద …నీకు దేవుడిని చూపిస్తాను” అని దగ్గరలోనే ఉన్న ఓ నదిలోకి తీసుకెళ్ళాడు. అకస్మాత్తుగా ఆ యువకుడు జుత్తు పట్టుకుని తటాలున నీళ్ళలోకి ముంచాడు. బిత్తరపోయిన ఆ యువకుడు గింజుకోవడం మొదలు పెట్టాడు. అయినా గురువు అతడిని వదలలేదు. కొన్ని క్షణాల తరువాత గురువు అతడిని వదిలి పెట్టాడు. నివ్వెరపోయిన అతడికి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది.

అప్పుడు గురువు అడిగాడు.

“నిన్ను నీళ్ళలోకి ముంచినపుడు నీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చాయి. నీ కుటుంబ సభ్యులు, నీ సమస్యలు ఏమైనా గుర్తుకువచ్చాయా?”

ఒక్కక్షణం ఆలోచించి ఆ యువకుడు బదులిచ్చాడు.

“లేదు గురువర్యా….నాకివేమీ గుర్తుకు రాలేదు. కేవలం బ్రతకాలన్న కోరిక, ఆక్సిజన్ కోసం తపన మాత్రమే కలిగాయి తప్ప మిగతావేవి కూడా ఆ సమయంలో జ్ఞప్తికి రాలేదు”

అపుడు గురువు ఇలా అన్నాడు.

“ఏదైనా లక్ష్యం ముందుంచుకున్నపుడు, దానిని సాధించాలన్న కోరిక ఎంత తీవ్రంగా ఉండాలంటే దాని ముందు మిగతా విషయాలన్నీ కూడా చిన్నవై పోవాలి, మాయమై పోవాలి. దేవుడిని చూడాలన్న నీ కోరిక కూడా ఇంతే బలంగా మారినపుడు నీకు తప్పనిసరిగా దేవుడు కనిపించి తీరుతాడు”

పరీక్షల కోసం సిద్దమవుతున్న విద్యార్థులకి కూడా లక్ష్యం చేరుకోవాలన్న కోరిక బలంగా ఉంటే మిగతా ఆలోచనలన్నీ అవే అదృశ్యమైపోతాయి.

పగటి కలలు:

ఆలోచనల్లో మరొక రకం పగటి కలలు కనడం.

మీరు Sub Inspecter పరీక్షకి చదువుతున్నట్లయితే, మీరు Sub Inspecter అయిపోయినట్లుగా, సంఘ వ్యతిరేకశక్తులను చితక్కొట్టినట్లుగా, అందరూ మిమ్మల్ని అభినందించినట్లూ, మీకు అవార్డులు వచ్చినట్లూ ……….ఇలా ఒక్కటేమిటి, ముగింపే లేకుండా ఎన్నో రకాలుగా ఊహించుకోవడం జరుగుతుంది.

గమ్మత్తేమిటంటే

 • పగటి కలలు కంటున్నట్లు మీరు కూడా గుర్తించక పోవడం.
 • ఈ పగటి కలలు మీకు సంతోషాన్ని కల్గించడం.

ఈ సంతోషానికి బానిస అయితే అందులోనే ఉండాలని అనిపిస్తుంది. అపుడు పుస్తకం ముందుంటుంది, మీరు మాత్రం వాస్తవాన్ని మరిచిపోయి కలల ప్రపంచంలోనే విహరిస్తూంటారు. చూసే వాళ్ళు “ఈ కుర్రాడు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోతోంది…. పాపం” అనుకుంటారు.

కొద్ది మోతాదులో పగటి కలలు మేలు  చేస్తాయి. గమ్యం వైపుగా ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మోతాదు మించితే మాత్రం లక్ష్య సాధనలో వెనుకబడి పోవడం తప్పదు.

అనవసరమైన ఆలోచనలు:

ఈ రకమైన ఆలోచనల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.

ఉదాహరణకి…….

రాత్రికి భోజనంలో ఏం కూర ఉంటే బాగుంటుంది?

వచ్చేవారం రిలీజయ్యే సినిమాకి టికెట్లు దొరుకుతాయా?

నిన్న క్రికెట్ మ్యాచ్ లో ధోని ఫలానా shot మరో రకంగా ఆడి ఉంటే బాగుండేది.

3. లక్ష్యాన్ని చిన్నవిగా మార్చుకోండి:

లక్ష్యాలు “మీరు నిజంగా చదువుతున్నారా లేదా?” అనే విషయాన్ని కొలవడానికి ఉపయోగపడుతాయి. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు “ఎంతదూరం వచ్చాం. ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సి ఉంది?” అని నిరంతరం గమనిస్తూ ఉంటాం కదా.

చదువుతున్నప్పుడు కూడా “ఎంత చదివాము, ఇంకా ఎంత చదవాల్సి ఉంది?” అని సమీక్షించుకోవాలి.

ప్రతీసారి పుస్తకం తెరిచి చదవడం మొదలు పెట్టేముందు, ఒక్కక్షణం ఆగి, ఎంత చదవాలనుకుంటున్నారో నిర్దేశించుకోవాలి. అయితే, ఎన్ని పేజీలు  చదువుతారనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.

మీ లక్ష్యం ఒక చాప్టర్ కావచ్చు లేక సింపుల్ గా ఒకపేజి అయినా కావచ్చు. ఇది మీరు స్వయంగా ఎంచుకున్న లక్ష్యం కాబట్టి దానిని పూర్తి చేయడానికి మీరు కట్టుబడి ఉంటారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం.

భారీ లక్ష్యాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రమాదముంది. అందువల్ల వాటిని విడగొట్టి, చిన్నవిగా మార్చుకోవడం అవసరం.

ఉదాహరణకి ..

‘నేను ఈ పుస్తకాన్ని చదవడం 5 రోజుల్లో పూర్తి చేస్తాను.’ అనే కన్నా …

ఇదే లక్ష్యాన్ని చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి

‘నేను ఈ చాప్టర్ ని 5 గంటల్లో పూర్తి చేస్తాను’ అని కాని

‘ఈ చాప్టర్ లోని రెండు పేజీలను అరగంటలో చదువుతాను’ అని నిర్దేశించుకోవడం మంచిది.

ఇక్కడ ఒక రహస్యమేమిటంటే …..

ప్రతీసారి లక్ష్యాన్ని పూర్తి చేసినపుడు మీ పై మీకు నమ్మకం పెరుగుతుంది. అరగంటలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయవంతంగా దానిని పూర్తిచేస్తే, వెంటనే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

మీ పై మీకు నమ్మకం పెరిగినపుడు అటోమేటిగ్గా మీ ఏకాగ్రత కూడా మెరుగవుతుంది.

4. Multi tasking ని ఆపి వేయండి:

ఒకే సమయంలో అనేక పనులు చేయడాన్నే multi tasking అంటాము.

ఇంట్లో అమ్మ, ఒక వైపు వంటచేస్తూ, మరో వైపు స్కూలుకి పిల్లల్ని తయారు చేయడం చేస్తూ మరో వైపు పనిమనిషికి సూచనలివ్వడం చేస్తుంది.

ఇదే multi tasking.

Multi tasking లో ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి.

ఉదాహరణకి

మోటార్ సైకిల్ నడుపుతూ, తలకి భుజానికి మధ్య మొబైల్ ని నొక్కిపెట్టి ఫోన్ లో మాట్లాడటం ఈ మధ్య మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం. ఏ కాస్త పొరపాటు జరిగినా దీనిలో ప్రాణమే పోయే ప్రమాదం ఉంది.

ఇక పరీక్షల విషయానికొస్తే చదువుకునే సమయంలో Multi tasking అస్సలు పనికి రాదు. ఉదాహరణకి మీరు చదువుకోవాల్సి ఉంది, అదే సమయంలో టీవీలో క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. మనలో చాలామంది టీవీ ముందు కూర్చుని కాసేపు టీవీ చూస్తూ, కాసేపు చదువుతూ ఉంటారు. ఇది సరైన పద్ధతేనా?

ముమ్మాటికీ కాదు.

Multi tasking వల్ల చేస్తున్న పనుల్లో దేని మీద కూడా దృష్టి కేంద్రీకరించలేక దేనికీ సంపూర్ణంగా న్యాయం చేయలేక పోతారు. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?

మీ ముందున్న రెంటిలో ఏది ముఖ్యమైనదో గుర్తించి దాని మీదే దృష్టిని పూర్తిగా లగ్నం చేయాలి.

ఇక క్రికెట్ మీకు ఇష్టమైనది కావచ్చు. కాని ఆ మ్యాచ్ ని Replay లోనో, Highlights లోనో, లేక youtube/Hotstar లలో మొత్తం మ్యాచ్ ని మళ్ళీ ఎప్పుడైనా చూడవచ్చు, కాదంటారా?

5. తగిన సమయాన్ని ఎంచుకోండి:

ప్రతీ వ్యక్తికీ తనకంటూ అనుకూలమైన సమయం ఒకటుంటుంది. ఆ సమయంలో పని చేసినపుడే అద్బుతమైన ఫలితాలు వస్తాయి.అలాగే విద్యార్థులు కూడా వారికి అనుకూలమైన  సమయాల్లో చదివినపుడే  ఏకాగ్రత కలిగి బ్రహ్మాండంగా గుర్తు పెట్టుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏ సమయంలో బాగా చదువగలరో ముందు గుర్తించండి.

కొందరు తెల్లవారు ఝామున చక్కగా చదువుతారు. దీనికి భిన్నంగా మరికొందరు అర్ధరాత్రి వేళల్లో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు.

ఈ విషయంలో ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకుండా, మీకు ఏ సమయం అనుకూలమైనదో దాని ప్రకారమే ముందుకు వెళ్ళండి.

ఏ సమయంలో చదివినా సరే ప్రతీ విద్యార్థికి, ముఖ్యంగా పరీక్షల సమయంలో కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి. ఈ 7 గంటల నిద్ర కూడా ఒకేసారి కాకుండా, విడతల వారిగా ఉన్నా కూడా తప్పు లేదు. మధ్యాహ్న సమయంలో చదువుతున్నపుడు మగతగా అనిపిస్తే ఒక అరగంట లేక గంట (Power nap) నిద్ర పోవడం కూడా మంచిదే. దీని వల్ల మీరు recharge అవుతారు.

6. Be Uncomfortable:

మెత్తని దిండు, చల్లని గాలి, వాలు కుర్చీ……..

ఇవన్నీ కూడా హాయినిస్తాయి. ఈ హాయి గనక మోతాదు మించితే నిద్రలోకి జారుకునే ప్రమాదముంది. అందువల్ల మీ పరిసరాలు కాసింత అసౌకర్యంగా ఉండడం కూడా మంచిదే.

7. బ్రేక్ నివ్వండి:

గంటల తరబడి ఒకేచోట కూర్చుని చదవాలనుకోవడం కూడా సరైన ఆలోచన కాదు.

ఒక చెట్టుని గొడ్డలితో నరకాల్సి వచ్చినప్పుడు నరకడం ఎంత ముఖ్యమో, మధ్యమధ్యలో గొడ్డలిని సానబెట్టడం కూడా అంతే ముఖ్యం. చదువు మధ్యలో తీసుకునే బ్రేక్ కూడా ఇలాంటిదే.

బ్రేక్ మిమ్మల్ని  Refresh చేస్తుంది

                  Recharge చేస్తుంది.

అందువల్ల మరింత వేగంగా, మరింత ఎక్కువగా మీరు గుర్తు పెట్టుకోగలుగుతారు.

ఇలా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఏకాగ్రతని మరింత పెంచుతూ చదవడానికి ఓ టెక్నిక్ ఉంది.

దాని పేరే Pomodoro Technique. ఇదొక టైం management టెక్నిక్.

దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి.

మధ్యలో తీసుకునే breaks వల్ల చదివిన Content Brain లోకి ఇంకిపోవడానికి తగిన సమయం లభించి, చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండి పోతాయి.

కూర్చున్న చోటి నుండి లేవకుండా గంటల తరబడి చదవాలన్న సంప్రదాయ పద్ధతులకి భిన్నంగా ప్రతీ కొన్ని నిముషాలకి (సాధారణంగా ప్రతీ 50 నిముషాలకి) 5 నిముషాలు బ్రేక్ తీసుకోవడం మూలంగా చదవడం అనే ప్రక్రియ కథినంగా అనిపించకుండా తెలికైనదిగా, సరదాగా అనిపిస్తుంది.

ఈ Pomodoro Technique లో

ముందుగా ఒక countdown టైమర్ ని లేక ఓ అలారమ్ clock ని పక్కనే ఉంచుకుంటాము.

దానిలో 50 నిముషాలకి అలారం సెట్ చేసుకుని పుస్తకంలో లీనమవుతాము.

అలారం మోగగానే లేచి 5 నిముషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇదే ప్రక్రియను కొనసాగిస్తాము.

ఒకవేళ మీకు సరిపడితే ఈ విధానం చాలా మంచి చేస్తుంది. అలాగే 50 నిముషాల బదులు మీకు నచ్చినట్టుగా సమయాన్ని కేటాయించుకోవచ్చు.

అయితే ఇలా చదువు మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల 5 నిముషాల కోసం నిర్ణయించుకున్న బ్రేక్ కాస్తా ఒక గంటగా మారే అవకాశముంది. అందువల్ల బ్రేక్ కోసం కేటాయించిన సమయం అయిపోగానే తిరిగి చదవడం తప్పనిసరిగా ప్రారంభించాలి. లేకపోతే బ్రేక్ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. స్వయం క్రమశిక్షణ లేని వారికి ఈ టెక్నిక్ అంతగా ఉపయోగకరమైనది కాదు.

8. ధ్యానం:

ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిందే.

ఒకేసారి అనేక ఆలోచనలు చేయడానికి అలవాటు పడ్డ brain కి, అనవసరమైన వాటిని తొలగించి, కేవలం ఒక్క అంశం పైనే దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది ధ్యానం.

అయితే ధ్యానం అనగానే “గంటల తరబడి చేయాలి” అని అనుకోకూడదు. కొద్దిసేపు చేసినా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ప్రతీరోజు కనీసం 15 నిముషాలయినా ధ్యానం చేయడం మంచిది. ఒకవేళ ధ్యానం వీలు కాకపోతే శారీరక వ్యాయామం గాని , నడక గాని, గాడంగా శ్వాస తీసుకోవడం లాంటి deep breathing టెక్నిక్స్ కూడా చేయవచ్చు.

9. వర్తమానంలో ఉండండి:

మనిషికి కలిగే ఆలోచనల్లో 90% గతం గురించి గాని, భవిష్యత్తు గురించి గాని అయి ఉంటాయి. ఇలా నిరంతరం జరిగిపోయిన విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి ఆలోచనలు రావడం నిజంగా ఒక శాపం. మార్చలేని విషయాల గురించి ఆలోచిస్తూ ఏకాగ్రతని, సమయాన్ని వృధా చేసుకోకుండా జరుగుతున్న విషయాలపైనే దృష్టి నిలిపితే ప్రతీ వ్యక్తికీ ఎంతో మేలు కలుగుతుంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేమిటంటే…ఎప్పుడైతే మనస్సు చదువు నుండి వైదొలగి ఇతర విషయాల పైకి మల్లిందో, అపుడు మీరు చేయాల్సిన మొదటి పని …..గుర్తించడం.

అవును, మీ మనసు ఇతర అంశాలపైకి మరలిందన్న విషయాన్ని గనక మీరు గుర్తిస్తే, వెంటనే మళ్ళీ వెనక్కి లాక్కొచ్చి చదువుపై ఉంచవచ్చు. ఈ విషయాన్ని మీరు ఎంత ఆలస్యంగా గుర్తిస్తే అంత విలువైన సమయం వృధా అవుతుంది.

10. ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండండి:

మీపై మీకున్న నమ్మకాన్ని పొరపాటున కూడా ఎన్నడూ సడలనివ్వకండి.

మీ పై మీకున్న నమ్మకం వల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుంది.

“నేను ఇది సాధించగలను. ఇది చాలా సులభమైన పని” అని మీరు అనుకున్నప్పుడు మరింత శ్రద్ధగా ఆ పని చేస్తారు. అపజయం ఎదురవుతుందన్న అనుమానమే గనక ఉంటే ఏకాగ్రత సంగతి అటుంచి “దీన్నుంచి ఎలా తప్పించు కుందామా….” అని Escape అయ్యే ఛాన్స్ కొరకు వెతకడం మొదలు పెడతారు.

ఉదాహరణకి ఒక One Day క్రికెట్ మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి ఒక జట్టు రంగంలోకి దిగినపుడు, లక్ష్యం చిన్నదిగా ఉంది కాబట్టి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండి మంచి ఏకాగ్రతతో ఆడతారు. అదే జట్టు 400  పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి వచ్చినప్పుడు ఆత్మ విశ్వాసం ఒకింత కొరవడి ఏకాగ్రత కోల్పోయి తక్కువ పరుగులకే All out అయి ఇంటి ముఖం పట్టడం మనం అనేకసార్లు చూసాం.

11. ఒత్తిడిని తగ్గించుకోండి:

ఒత్తిడి ఎందుకు కలుగుతుంది?

కాస్త ముందు చూపుతో ముందుగానే చదవడం ప్రారంభించకుండా రేపు పరీక్ష ఉందనగా ఇప్పుడు మొత్తం చదవాలని నిర్ణయించుకున్నపుడు ఒత్తిడి కలగడం సహజం. ఒకే రోజులో సబ్జెక్టు అంతా చదవడం అసాధ్యమే గాకుండా తప్పనిసరిగా చదవాలి అన్న డిమాండ్ వల్ల brain పై ఒత్తిడి పెరిగి మామూలు సమయంలో సులువుగా అర్థం అయ్యే టాపిక్ కూడా అర్థం కాని స్థితి ఏర్పడుతుంది.

దీనిని ఉదాహరణలో చెప్పాలంటే ఒక ఓవర్లో ఏదో ఒక బంతికి సిక్సర్ కొట్టాల్సి రావడం చాలామంది అటగాళ్ళకి సాధ్యమే, కాని చివరి బంతికి తప్పనిసరిగా సిక్సర్ కొట్టాల్సి రావడం కష్ట సాధ్యం. ఈ బంతికి సిక్సర్ కొట్టాల్సిందే, మరో మార్గం లేదు అన్నప్పుడు ఆటగానిపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎంత మంచి ఆటగాడైనా తడబడే అవకాశముంది.

అందువల్ల చదవడాన్ని చివరి రోజు వరకు వాయిదా వేయకుండా ముందు నుండే రోజూ కొంత సిలబస్ చదువుకుంటూ వస్తే చివరి నిముషంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

***                                                   ***                                             ***

ఏమాత్రం Miss అవకండి.

విలువైన Content..మీకోసం….

 

 • English Grammar in Telugu: Reading Comprehension పై పట్టు సాధించడానికి 42 Tips.

http://bit.ly/2B0hSE7

 

 • Job Interview Tips In Telugu: Do’s and Don’ts.

http://bit.ly/2FZ1SFS

 

·       Spoken English In Telugu: 101 Tips.

http://bit.ly/2G2qI80

 

 • Interview Skills

http://bit.ly/2MF2zFT

 

 • Improve Spoken Skills

http://bit.ly/2WmNYTY

***                      ***                      ***              ***

Updates, Offers:

చాలామంది విద్యార్థులకి మా Content updates, Courses offers అందటం లేదని Message చేస్తున్నారు.

మా Content updates, Courses offers ఏమాత్రం Miss కావద్దనుకుంటే Facebook లో మా పేజిని (https://www.facebook.com/SiriAcademy/) like చేయండి. ఆ తరువాత మీరు Facebook లో ఉన్నప్పుడు ఎడమ వైపున కనిపించే ‘Pages’ పై click చేయండి. అక్కడ మీరు Like చేసిన Pages అన్నీ కనిపిస్తాయి. Siri Academy పేజిపై click చెయండి. ఆ తరువాత ‘Following’ అనే Tab లో “See First” ని Select చెసుకొండి. ఇక updates అన్నీ అందుతాయి.

 

మా కోర్సుల  గురించి తెలుసుకోవాలనుకుంటే క్రింది లింకులో చూడవచ్చు.

http://siriacademy.com

 

‘మరింత విలువైన Content కావాలి’ అనుకుంటున్నారా?

అయితే..

 • Like చేయండి.
 • Comment చేయండి.
 • Share చేయండి.

 

 

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *